11 మందికి లీగల్ నోటీసులు పంపిన ఏబీ వెంకటేశ్వరరావు
- తనపై అక్రమ కేసులు బనాయించారన్న ఏబీ వెంకటేశ్వరరావు
- తప్పుడు ఆరోపణలతో సస్పెండ్ చేశారని మండిపాటు
- రూ. కోటి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్
ఏపీ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు గత ప్రభుత్వ హయాంలో తనపై జరిగిన చర్యలపై న్యాయపోరాటం ముమ్మరం చేశారు. పలువురు ఐపీఎస్ అధికారులు, కీలక వ్యక్తులకు ఈరోజు ఆయన పంపిన లీగల్ నోటీసులు ఐపీఎస్ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. తన పరువుకు భంగం కలిచారంటూ ఏకంగా 11 మందికి ఆయన పరువునష్టం నోటీసులు పంపారు.
అక్రమ కేసులు బనాయించడం, తప్పుడు సమాచారాన్ని మీడియాకు లీక్ చేయడం ద్వారా తనను మానసిక వేదనకు గురిచేశారని ఆయన నోటీసుల్లో పేర్కొన్నారు. తన పరువుకు భంగం కలిగించినందుకు గాను రూ. కోటి నష్టపరిహారం చెల్లించాలని ఏబీవీ డిమాండ్ చేశారు. అప్పట్లో తప్పుడు ఆరోపణలతో తనను సస్పెండ్ చేయడమే కాకుండా, వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో కీలకంగా వ్యవహరించిన అధికారులే లక్ష్యంగా ఈ నోటీసులు వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది.
నోటీసులు అందుకున్న వారిలో... గౌతమ్ సవాంగ్ (అప్పటి డీజీపీ), పీఎస్ఆర్ ఆంజనేయులు (అప్పటి ఇంటెలిజెన్స్ బాస్), రవిశంకర్ అయ్యనార్ (అప్పటి ఏడీజీ), పూడి శ్రీహరి (అప్పటి సీఎం జగన్ సీపీఆర్వో) తదితరులు ఉన్నారు.